Thursday, July 31, 2008

భక్తుల్ని కాపాడే భద్రకాళి

ఆధునికత పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో భక్తిభావం పెంపొందుతూనే ఉంటుంది. సమాచార ప్రసార విప్లవం కారణంగా మారుమూల ప్రాంతాల్లోని దేవాలయాలు కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తమకున్న ఆదాయ పరిమితులు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనన్ని దేవాలయాలను సందర్శించి ఆధ్యాత్మిక, మానసికానందాలను సొంతం చేసుకుంటున్నారు, మానసికమైన ఆనందం శారీరక ఇక్కట్లను దూరం చేస్తుందని అంతా నమ్ముతున్నారు. యోగ. ధ్యాన ం లాగే ఆలయాల సందర్శనని జీవనశైలిలో భాగంగా మార్చుకుంటున్నారు. కష్టసుఖాల నుంచి భక్తుల్ని కాపాడే శక్తిస్వరూపిణి భద్రకాళి. దేశంలో వివిధ ప్రాంతాల్లో గల అష్టాదశ శక్తి పీఠాలు కోట్లాది మంది భక్తుల్ని సదా కాపాడుతూ ఉంటాయి. దుష్టశిక్షణ శిష్ట రక్షణ సంకల్పంగా అమ్మవారు వివిధ రూపాల్లో, వివిధ ప్రాంతాల్లో కొలువై భక్తుల నుంచి పూజలందుకుంటున్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలో వెలసిన భద్రకాళి అమ్మవారి ఆలయం రమణీయంగా, భక్తి పారవశ్యాన్ని పెంచేలా వుంది. భద్రకాళి అమ్మవారి దర్శనం సకల పాపాలను హరించి, అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తున్న్తారు. భద్రకాళిని తమ అభీష్టాలను నెరవేర్చే అమ్మవారిగా భక్తులు భక్తితో కొలుస్తారు.

ఆలయ చరిత్ర


ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర వుంది. ఎనిమిది కరములతో అన్ని కష్టాల నుంచి భక్తుల్ని గట్టెక్కిస్తుందని నమ్ముతారు. ఎనిమిది చేతుల లోని ఆయుధాలు దుష్టశిక్షణకి ఉద్దేశించినవి. దుష్ణుల్ని శిక్షించి భక్తకోటిని రక్షించడానికి ఈ ఆయుధాల్ని అమ్మవారు వినియోగిస్తారు. సహజసిద్ధంగా ఏర్పడిన రాయి నుంచి అమ్మవారి విగ్రహాన్ని చెక్కారని చెప్తారు. కొండప్రాంతంలోని రాళ్ళకు ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయని, ఆ శక్తి స్వరూపిణి ఆ ప్రాంతంలో కొలువై సదా ఈ విశ్వాన్ని రక్షిస్తుందని నమ్ముతారు. అమ్మవారి ఆలయం సమీపంలోని కోనేరు సహజసిద్ధంగా ఏర్పడింది. అమ్మవారి ఆలయంలోంచి చూస్తే కోనేటి ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంటుంది. హన్మకొండ, వరంగల్‌ జంట నగరాల మధ్య ఈ ఆలయం కొలువై వుంది. కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడి వుందని ఆధారాలను బట్టి తెలుస్తోంది. అమ్మవారిని వివిధ రూపాల్లో అందంగా అలంకరిస్తారు. ప్రాచీన, ఆధునిక శిల్పకళా రీతులు ఆలయంలో ప్రతి చోటా కన్పిస్తాయి. ఉగ్రరూపంతో సింహాసనంపై ఆశీనురాలైన అమ్మవారు కిరీటంతో భక్తిభావాన్ని భక్తుల్లో కలిగిస్తారు.

చాళుక్య వంశపు రాజు రెండవ పులకేశి క్రీస్తుశకం 625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అమ్మవారి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, వెడల్పుతో గంభీరంగా వుంటుంది. ఈ విగ్రహాన్ని కాకతీయ గణపతిదేవుడు అభివృద్ధి చేశాడని, ఆలయం సమీపంలో కోనేటిని నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. ఈ మధ్యనే ఈ ఆలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరమ్మతులు చేసింది.

ఉత్సవాలు


శ్రావణ మాసం అంటే ఆగస్టు-సెప్టెంబర్‌ మాసాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. పూజలు చేస్తారు. ఆషాఢంలో అంటే జూలై నెలలో భద్రకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంనుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అసంఖ్యాకంగా విచ్చేస్తారు. మంగళ శుక్రవారాలు, దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి సమీపంలో ఉద్యానవనం భక్తులకి ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ ఆలయానికి సమీపంలో చిన్నా పెద్దా 12 దేవాలయాలున్నాయి. భక్తులు ఈ ఆలయాలను కూడా సందర్శిస్తే వారి యాత్ర సంపూర్ణం అవుతుందని చెప్పవచ్చు.

వసతి సౌకర్యం


వరంగల్‌ పట్టణానికి సమీపంలో ఈ ఆలయం ఉండడంతో ఆలయాన్ని సందర్శించుకునేవారు ఆలయం సమీపంలోని సత్రాలతో పాటు, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లను ఉపయోగించుకోవచ్చు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు వివిధ సౌకర్యాలను ఏర్పాటుచేశారు. భక్తులకు మంచినీటి వసతి అందుబాటులో వుంది.

ఎలా చేరుకోవచ్చు?


వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఉన్న భద్రకాళి ఆల యం చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఐదుకిలోమీటర్ల దూరంలో భద్రకాళి ఆలయం వుంది. హైదరాబాద్‌ నుంచి బస్సు, రైలు సౌకర్యాలు మెండుగానే ఉన్నాయి. రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడికి ఈ ఆలయం సమీపంలో వుంది.

అద్భుత శిల్పకళా చాతుర్యంతో అలరారే భద్రకాళి అమ్మవారి ఆలయ దర్శనం భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు ఆధ్యాత్మికానుభూతిని కలిగిస్తుంది. చాళుక్య రాజుల కళాత్మకతకు ఈ ఆలయం అద్దం పడుతుంది. వేలాదిమంది భక్తులు తమ కోరికలను అమ్మవారికి తెలియజేసి ఆమె క రుణాకటాక్ష వీక్షణాలను పొందుతారు. ఏడాదిలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకుని ముక్తిని పొందుతారు.

-జి.సత్యనారాయణరాజు